మోదీ నాయకత్వంలో మన దేశం అద్భుతమైన గుర్తింపును పొందింది: డీకే అరుణ

  • 2047 నాటికి వికసిత్ భారత్ గా మార్చడమే లక్ష్యమన్న అరుణ
  • రైతులకు రూ. 24 వేల వరకు ఎరువుల సబ్సిడీని కేంద్రం అందిస్తోందని వెల్లడి
  • ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వ్యాఖ్య

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుస్థిర నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన గుర్తింపును సొంతం చేసుకుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ కొనియాడారు. 2047 నాటికి దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బలమైన వ్యూహంతో ముందుకు సాగుతోందని ఆమె స్పష్టం చేశారు.


మహిళా సాధికారత, అన్నదాతల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అరుణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలను 'లఖ్‌పతి, క్రోర్‌పతి దీదీలు'గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. అలాగే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ, రైతులకు ఎకరాకు రూ. 24 వేల వరకు ఎరువుల సబ్సిడీని అందిస్తోందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు ప్రజల జీవితాల్లో ఎంతో భరోసానిచ్చాయని వివరించారు.


మోదీ తీసుకున్న సాహసోపేతమైన, విప్లవాత్మక నిర్ణయాల వల్లే భారత్ నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అరుణ మీడియాతో వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపిందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ అమలుతో పాటు స్వచ్ఛ భారత్ అభియాన్, జన్ ధన్ యోజన వంటి మైలురాయి లాంటి కార్యక్రమాలు దేశ రూపురేఖలను సమూలంగా మార్చేశాయని, దేశ ప్రగతి-ప్రజల సంక్షేమమే రెండు కళ్లుగా సాగుతున్న ఈ పాలన రికార్డు స్థాయి విజయాలను నమోదు చేస్తోందని ఆమె కొనియాడారు.


DK Aruna
Narendra Modi
Viksit Bharat
BJP
Women Empowerment
Indian Economy

More Telugu News